ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇటీవల వచ్చిన 23 బాంబు బెదిరింపులను ఓ క్లాస్ 12 విద్యార్థి పంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గతంలోనూ అనేక బెదిరింపు సందేశాలు పంపినట్టు సదరు విద్యార్థి అంగీకరించాడని డీసీపీ సౌత్ అంకిత్ చౌహాన్ తెలిపారు. పరీక్షలు రాయకుండా తప్పించుకోవడానికే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి పరీక్షలు రద్దు చేస్తారని భావించినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థినే పలుమార్లు బెదిరింపులకు కారణమని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. ఈ విద్యార్థే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు చెప్పుకొచ్చారు.