Pushpak: పుష్పక్ ప్రయోగం సక్సెస్

ఇస్రో ఖాతాలో మరో ఘనత

Update: 2024-06-23 06:45 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన పునర్వినియోగ ప్రయోగ వాహనం-ఎల్‌ఎక్స్-03 (ఆర్‌ఎల్‌వి-లెక్స్-03) ‘పుష్పక్’ను వరుసగా మూడోసారి విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా గొప్ప విజయాన్ని సాధించింది. పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని ల్యాండింగ్ చేయడంలో విజయం సాధించిన తర్వాత, ‘పుష్పక్’ కక్ష్య రీ-ఎంట్రీ పరీక్షను నిర్వహించడానికి ఇస్రోకు ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది. క్లిష్ట పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ‘పుష్పక్’ ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ని అమలు చేసిందని ఇస్రో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

బెంగళూరుకు 220 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో  ఈ పరీక్ష జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా పుష్పక్‌ను 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి రన్‌వేపై స్వయంప్రతిపత్తి ల్యాండింగ్ కోసం విడుదల చేశారు. రెండవ ప్రయోగంలో, పుష్పక్ 150 మీటర్ల క్రాస్ రేంజ్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈసారి క్రాస్ రేంజ్ ను 500 మీటర్లకు పెంచారు. హెలికాప్టర్ నుండి పుష్పక్ విడుదలైనప్పుడు, అది ల్యాండింగ్ వేగం గంటకు 320 కి.మీ కంటే ఎక్కువగా ఉంది. బ్రేక్ పారాచూట్ సహాయంతో, టచ్ డౌన్ కోసం దాని వేగాన్ని గంటకు 100 కి.మీ. కు తగ్గించారు. ఆకాశంలో 4.5 కి.మీ ఎత్తునుంచి దిగింది పుష్పక్‌. పుష్పక్ విజయవంతానికి కృషీ చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్‌.

Tags:    

Similar News