విస్తృతమైన హిమానీనదాలు, మంచు కవచం వల్ల హిమాలయ పర్వతాలను మూడో ధ్రువం అని పిలుస్తారు.. భౌతిక లక్షణాలు, సామాజిక ప్రభావాల పరంగా ప్రపంచ వాతావరణంలో మార్పులు అత్యంత సున్నితంగా ఉంటాయి. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి హిమానీనదాలు తిరోగమనం, సన్నబడటం వంటి అపూర్వమైన మార్పులను ఎదుర్కొంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ తిరోగమనం హిమాలయ ప్రాంతంలో కొత్త సరస్సుల ఏర్పడటానికి, ఇప్పటికే ఉన్న వాటి విస్తరణకు దారితీస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజా అధ్యయనం హెచ్చరించింది.
భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని పేర్కొంది. ‘శాటిలైట్ ఇన్‌సైట్స్.. భారత హిమాలయాల్లో విస్తరిస్తోన్న హిమాలయ సరస్సులు’ పేరుతో నివేదికను ఇస్రో సోమవారం విడుదల చేసింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 601 ( 89 శాతం) రెండు రెట్లు కంటే ఎక్కువ, పది సరస్సులు తమ పరిమాణం కంటే ఒకటిన్నర నుంచి రెండు రెట్లు, 65 సరస్సులు ఒకటిన్నర రెట్లు మేర విస్తరించాయని, వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేసింది. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించే దీర్ఘకాలిక ఉపగ్రహాలు తీసిన ఫోటోలను విశ్లేషించిన ఇస్రో.... నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు గుర్తించింది.