Isro technology : ర్యాగింగ్ ని గుర్తించే సాంకేతికత కనుక్కోండి
ఇస్రోకి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్;
ర్యాగింగ్.. విద్యార్థులను గడగడ వణికించే భూతం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ దీనిని నియంత్రించడం ఎవరి వల్లా కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ను కనుగొనే ఆధునిక సాంకేతికతను కనిపెట్టి.. ర్యాగింగ్ బారిని విద్యార్థులను రక్షించేలా చూడాలని పశ్చిమ బెంగాల్ సీవీ ఆనంద్ బోస్ భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను సమర్థవంతంగా నిరోధించడానికి తగిన సాంకేతికతను అందించాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ సి వి ఆనంద బోస్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సంప్రదించారు. గవర్నర్ బోస్ హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ , రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించనుంది.
జాదవ్‌పూర్ యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్‌లోని బాల్కనీలో నుంచి పడి మృతి చెందాడు.దీనిపై విచారణ జరిపిన పోలీసులు ర్యాగింగ్ లో భాగంగా యువకుడిని నగ్నంగా ఊరేగించినట్లు తెలుసుకున్నారు. అతను గంటకు పైగా ర్యాగ్‌కు గురయ్యాడని, బెదిరింపు నుండి తప్పించుకోవడానికి అతను ఒక గది నుండి మరొక గదికి పరిగెత్తాడని దర్యాప్తులో తేలింది. ర్యాగింగ్ ఎపిసోడ్ సమయంలో విద్యార్థి స్వలింగ సంపర్కుడు అంటూ తిట్లు కూడా ఎదుర్కొన్నాడని తెలిపారు. మొత్తానికి స్వప్నదీప్ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని తేల్చారు. విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ మృతిపై యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు సాంకేతిక సాయం అందించాలని ఇస్రోను కోరారు.