Chandrayaan-3: జాబిల్లి పెరట్లో ప్రజ్ఞాన్ ఆటలు
ప్రజ్ఞాన్ రోవర్ నూతన వీడియోను పోస్ట్ చేసిన ఇస్రో... చందమామపై సల్ఫర్ ఉన్నట్లు మరోసారి స్పష్టీకరణ;
జాబిల్లి (Moon) ఉపరితలంపై దిగిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్ రోవర్ (Rover) తన పరిశోధనల్లో నిమగ్నమైంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ (Rover) అటూ ఇటూ తిరుగుతూ( Pragyan rotating) పరిశోధన సాగిస్తోంది. చందమామపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది.(search of a safe route ). ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇస్రో (Indian Space Research Organisation) తాజాగా ట్విట్టర్(X)లో పోస్ట్ చేసింది. సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతోందని, ప్రజ్ఞాన్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించిందని ఇస్రో ట్వీట్ చేసింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ వీడియో అంటూ ఇస్రో సరదగా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
మరోవైపు.... జాబిల్లిపై సల్ఫర్ ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ మరోసారి ధ్రువీకరించింది. కొన్నిరోజుల క్రితమే సల్ఫర్ సహా ఇతర మూలకాలు ఉన్నట్లు తేల్చి రోవర్ మరో పరికరం ద్వారా సల్ఫర్ ఉనికిని మరోసారి తెలియజేసింది. రోవర్‌లో ఉన్న ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్-APXS పరికరం సల్ఫర్‌తో పాటు కొన్ని ఇతర చిన్న మూలకాలను కూడా
గుర్తించింది. కొన్ని రోజుల క్రితం రోవర్‌లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ LIBS కూడా చంద్రుడిపై సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. చంద్రుడిపై సల్ఫర్ ఎలా వచ్చిందనే కోణంలో శాస్త్రవేత్తలు తాజా వివరణలను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఇస్రో తెలిపింది.
సల్ఫర్ స్వాభావికంగానే చంద్రుడిపై ఉందా లేక అగ్నిపర్వతం లావా వల్ల ఏర్పడిందా లేక ఉల్కల కారణంగా అక్కడకు చేరిందా అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని ఇస్రో పేర్కొంది. ఇస్రో విడుదల చేసిన వీడియోలో రోవర్‌కు అతుకుని ఉన్న 19 సెంటీమీటర్ల పొడవైన APXSగుండ్రంగా తిరుగుతూ, డిటెక్టర్ హెడ్‌తో కలిసి చంద్రుడి ఉపరితలంపై 5 సెంటీమీటర్ల లోతున తవ్వినట్లు కనిపిస్తోంది. తద్వారా అక్కడ మట్టిని విశ్లేషించి సల్ఫర్ ఉన్నట్లు ధ్రువీకరించింది. చంద్రుడి వంటి పరిమిత వాతావరణం ఉన్న గ్రహాల ఉపరితలంపై మట్టి, రాళ్లలో కలిసి ఉన్న మూలకాలను విశ్లేషించేందుకు APXS పరికరం ఉత్తమమైనదని..ఇస్రో పేర్కొంది. ఆల్ఫా కణాలు, ఎక్‌రేలను విడుదల చేసే... రేడియోధార్మిక పదార్థాలను APXS కలిగి ఉంటుందని తెలిపింది. మట్టిలో ఉండే అణువులు వాటి స్వభావానికి అనుగుణంగాఎక్స్‌రే లైన్లను విడుదల చేస్తాయి. వాటి నుంచి వెలువడే శక్తిని కొలవడం, ఎక్స్ కిరణాల తీవ్రతను బట్టి పరిశోధకులు మట్టిలో ఉండే మూలకాలను గుర్తించేందుకు వీలుపడుతుంది.