Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

నలుగురు జవాన్లు వీరమరణం;

Update: 2023-12-22 00:30 GMT

జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మద్యాహ్నం సురాన్ కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగినట్లు లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంపై గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అదనంగా సైనికులను తరలిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని తెలిపారు. మరోవైపు ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. దాడి అనంతరం ముష్కరుల వేట ప్రారంభించిన భద్రతా బలగాలు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ వేట కొనసాగిస్తోంది. మూడు రోజులుగా జవాన్లు...అడవులను జల్లెడ పడుతున్నారు. రాజౌరి నుంచి సురన్ కోటే వైపు జవాన్లు వాహనాల్లో వెళ్తుండగా, భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు. 


గత నెలలో రాజౌరీ జిల్లా కాలాకోటే వద్ద ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రమూకలకు నిలయంగా మారడంతో పాటు సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం 2003, 2021 మధ్య చాలా వరకు తీవ్రవాదం లేకుండా ఉంది. ఆ తర్వాత తరచుగా ఎన్‌కౌంటర్లు జరగడం మొదలయ్యాయి. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 35 సైనికులు అమరులయ్యారు. 

Tags:    

Similar News