Jayalalitha’s Assets: జయలలిత ఖజానాలో 4 వేల కోట్లు
1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు;
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత జయలలితకు చెందిన అక్రమ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించింది. ఇన్నాళ్లు బెంగళూరులోని కోర్టు కస్టడీలో ఉన్న ఆమె ఆస్తులు, వాటి పత్రాలను శుక్రవారం అధికారులు అధికారికంగా అప్పగించారు. జయలలితకు చెందిన 10 వేల చీరలు, 27 కేజీల బంగారం, వజ్రాభరణాలు, 750జతల పాదరక్షలు, 601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు, ఇతర వస్తువులు, సామగ్రిని న్యాయమూర్తి హెచ్‌ఎన్ మోహన్ సమక్షంలో వాటిని జైలు అధికారులు తమిళనాడు అధికారులకు అప్పగించారు. అక్రమార్జనకు సంబంధించి 2004లో తమిళనాడులో జయలలితపై కేసు నమోదు కాగా, దానిని కర్ణాటకకు బదిలీ చేశారు. తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తీసుకువచ్చి భద్రపరిచారు. ఆ సమయంలో ఆ ఆస్తుల విలువ 913.3 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడది 4 వేల కోట్లు ఉండవచ్చునని భావిస్తున్నారు.
1991-96 మధ్య జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినందుకు అవినీతి నిరోధక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడు అవినీతి నిరోధక శాఖ పోలీసులు జయలలిత ఇంటిపై దాడి చేసి బంగారం, వజ్రాల ఆభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన గడియారాలు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ నగలు, వస్తువులన్నీ కర్ణాటక నుంచి తమిళనాడుకు తరలించారు.