Bihar Elections: 44 మందితో తుది జాబితాను విడుదల చేసిన జేడీయూ

మొత్తం 101 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన

Update: 2025-10-16 07:30 GMT

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. బీహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్  ఇప్పటికీ సీట్ల పంపకాల ప్రతిష్టంభనతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ జేడీయూ  దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను (57 మంది అభ్యర్థులతో) విడుదల చేసిన జేడీయూ.. ఇప్పుడు రెండో జాబితా (ఫైనల్‌ లిస్ట్‌)ను కూడా రిలీజ్‌ చేసింది. 44 మంది అభ్యర్థులను ప్రకటించింది.

బీహార్‌ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ (ఆర్‌) 29 స్థానాల్లో, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎం (ఎస్‌) చెరి ఆరు స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. బీహార్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ వివరాలను ఆదివారం ప్రకటించారు. ఇక బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్‌ 6, రెండో దశ నవంబర్‌ 11 తేదీల్లో జరగనున్నాయి. అదేనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు ఖరారు చేసుకుని రెండు రోజులు కూడా కాకముందే బీహార్‌లోని అధికార ఎన్డీఏలో ముసలం ప్రారంభమైంది. చిన్న పార్టీలైన ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం)లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక అధికార జేడీయూ పార్టీలో కూడా పలువురు నేతలు తమ నిరసనను తెలుపుతున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒక సీటు గెల్చుకున్న చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌)కి 29 సీట్లు కేటాయించడం పట్ల మండిపడుతున్నారు. ‘ఎన్డీఏలో ఏదీ బాగా లేదు’ అని రాజ్యసభ ఎంపీ కుశ్వాహ పేర్కొన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీకి 29 సీట్లు కేటాయించడమేమిటని జేడీయూ నేతలు సీఎం నితీశ్‌ కుమార్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనిపై ఆగ్రహంతో భాగల్పూర్‌కు చెందిన జేడీయూ ఎంపీ అజయ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఒక స్థానిక ఎంపీగా టికెట్‌ కేటాయింపులో తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే గోల్‌పూర్‌ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ కూడా జేడీ(యూ)కు రాజీనామా చేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News