జీవితంలో అత్యంత గొప్ప క్షణాలు అవే : జస్టిస్ ఎన్‌వీ రమణ
న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని... ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. ఒక వ్యక్తి మంచి జీవితం..;
న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని... ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాలను అలవరచుకోవాలని తెలిపారు. వినయం, ఓర్పు, దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలను కలిగి ఉండాలని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. మద్రాస్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన... సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ సంతాప సభలో శనివారం వీడియో ద్వారా మాట్లాడిన జస్టిస్ ఎన్‌వీ రమణ.... ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు గొప్ప బలం అని అన్నారు.
నమ్మకం, ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావు.... వాటిని సంపాదించుకోవాలని జస్టిస్ ఎన్‌వీ రమణ అభిప్రాయం వ్యక్తంచేశారు. మన విలువలే మనకున్న గొప్ప సంపద అని.. వాటిని ఎప్పుడూ మరిచిపోకూడదని తెలిపారు. న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్న బార్ బెంచ్‌లు కలిసి... మనకు సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థను వారసత్వ సంపదగా ఇచ్చాయని జస్టిస్ లక్ష్మణన్ అన్న మాటలను మనమంతా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు రాముణ్ని కొలవాల్సింది ఆయన విజయాలను చూసికాదు... అత్యంత కష్టసమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి... అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. అదే విలువలకిచ్చే గౌరవం. అని తెలిపారు. ఒకరి జీవితంలో అత్యంత గొప్ప క్షణాలు అవే అని చెప్పారు.