Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..

నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

Update: 2025-10-31 01:21 GMT

సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ స్థానంలో నవంబర్‌ 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించాలని జస్టిస్‌ గవాయ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికారాలను వినియోగించి జస్టిస్‌ సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. కాగా, హర్యానాకు చెందిన జస్టిస్‌ సూర్యకాంత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు.

అంతకుముందు ఆయన పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. న్యాయపరమైన తర్కానికి, సామాజిక న్యాయంపై బలమైన ప్రాధాన్యతకు పేరుగాంచిన ఆయన రాజ్యాంగ ధర్మాసనంలోని అనేక విషయాలలో, పాలన, పర్యావరణ సమస్యలు, రాజ్యాంగ వివరణలపై కీలక తీర్పులలో భాగంగా ఉన్నారు. 14 నెలల పాటు సీజేఐగా ఉండనున్న ఆయన ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్‌ జస్టిస్‌, డిజిటల్‌ ప్రైవసీ వంటి ప్రధాన రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులలో భాగస్వామి కానున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేుషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని ఆదేశించిన ఘటన కూడా ఈయనదే. సైన్యంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను సమర్థించి, దానిని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News