తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్‌కు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించే విధంగా ఒప్పందం కుదిరింది.
70 ఏళ్ల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వైదొలిగారు. అయినప్పటికీ ఆయన పార్టీ తమిళనాడులో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చింది. ద్రవిడ పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకెలకు ప్రత్యామ్నాయంగా కమల్ హాసన్ 2018 లో ఎంఎన్ఎంను స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగిన పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ పార్లమెంటు అరంగేట్రం గురించి సూచనప్రాయంగా చెప్పారు.
తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎంపీలు – అన్బుమణి రామదాస్, ఎం షణ్ముగం, ఎన్ చంద్రశేఖరన్, ఎం మహ్మద్ అబ్దుల్లా, పి విల్సన్, వైకో – పదవీకాలం జూలై 25తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలం ప్రకారం, డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పార్టీ ఆరు రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. మిగిలిన రెండు స్థానాలు బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన అన్నాడీఎంకేకు వెళ్లే అవకాశం ఉంది.