KARNATAKA: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో సంచలన ప్రకటన

ప్రైవేటు రంగాల్లో స్థానికులకే ప్రాధాన్యంపై మరో ప్రకటన... వచ్చే కేబినేట్ భేటీలో చర్చిస్తామని వెల్లడి;

Update: 2024-07-19 02:45 GMT

కర్ణాటకలోని ప్రైవేటు రంగాల్లో స్థానికులు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘బిల్లు’పై తీవ్ర దుమారం రేగుతోంది. ప్రైవేటు సంస్థల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడంతో.. మరో దారిలేక కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే.. దీనిని తాత్కాలికంగానే నిలిపివేశామని.. వచ్చే కేబినెట్ సమావేశంలో మరోసారి చర్చిస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అప్పుడు ఈ బిల్లుపై ఉండే సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తామని వెల్లడించారు. ఈ అంశంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘‘సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రైవేటు కోటాపై పూర్తిస్థాయి చర్చ జరగలేదు. కానీ.. ఈలోపే దీనిపై మీడియాలో కథనాలు వచ్చేశాయి. దీంతో.. గందరగోళ వాతావరణం నెలకొంది. తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి.. సందేహాలను నివృత్తి చేస్తాం. సభలోనూ వివరంగా చర్చిద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రైవేటు బిల్లుపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష నేత ఆర్‌. అశోక్ డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

ఏదేమైనా.. కర్ణాటకలో ఈ వ్యవహారంపై పెను దుమారం రేగుతోంది. ఈ అంశంపై సీఎంకు ఏమాత్రం క్లారిటీ లేదని, భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత అశోక్‌ మండిపడ్డారు. తన ఎక్స్ ఖాతాలో ఆయన తన సందేశాన్ని మూడుసార్లు మార్చారని గుర్తు చేశారు. బిల్లుపై భిన్న వ్యాఖ్యలు చేయడం, చివరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం.. తుగ్లక్ పాలనాల ఉందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇందుకు సిద్ధరామయ్య బదులిస్తూ.. తమది తుగ్లక్ ప్రభుత్వం కాదని, వచ్చే కేబినెట్‌ సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకుంటామని, బిల్లుపై వివరంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.

కర్ణాటకలోని ప్రైవేటు పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో కన్నడిగులకు ఉపాధి కల్పించే బిల్లుని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేట్ సంస్థలు కన్నడిగులకు ఉద్యోగాలను తప్పనిసరిగా రిజర్వ్ చేయాలన్నది ఆ బిల్లు ఉద్దేశం. మేనేజ్‌మెంట్ కేటగిరీలో 50%, నాన్-మేనేజ్‌మెంట్ కేటగిరీలో 70% మంది స్థానిక అభ్యర్థులను నియమించాలని ప్రభుత్వం ఆ బిల్లులో పేర్కొంది. కన్నడిగుల ప్రయోజనాల కోసం ఈ బిల్లు రూపొందించామని తెలిపింది. దీంతో.. దీనిపై ఇంటా, బయటా విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News