కర్నాటక అసెంబ్లీ పోలింగ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. విజయపుర జిల్లాలో రణరంగంగా మారింది పోలింగ్. బస్వేన్‌బాగేవాడి నియోజకవర్గంలోని మసబినల్ గ్రామంలో పోలింగ్ సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. నిరుపయోగంగా ఉన్న ఈవీఎంలను తరలిస్తున్న క్రమంలో భారీగా చేరుకున్న గ్రామస్తులు పోలింగ్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు ఎన్నికల సిబ్బంది వాహనాలపై దాడి చేశారు. అడ్డొచ్చిన పోలీసులను సైతం వదల్లేదు ఆందోళనకారులు. గ్రామస్తుల దాడిలో ఎన్నికల సిబ్బందితో పాటు పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. గ్రామస్తుల ఆందోళనతో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఖాళీగా ఉన్న ఈవీఎంలను తరలించడమే ఘర్షణకు కారణం అయ్యింది. పోలింగ్ నిలిపివేసి ఈవీఎంలను తరలిస్తున్నారనే ప్రచారంతోనే గ్రామస్తులు దాడికి తెబడ్డట్లు తెలుస్తోంది. గ్రామస్తుల దాడిలో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లు ధ్వంసం అయ్యాయి. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు... పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతుందని.. ఘర్షణకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.