Karnataka : కర్ణాటకలో ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలపై నిషేధం
ఈ నెల 6 నుంచి ...;
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలను నిషేధించింది. ఇది మహిళలకు సురక్షితం కాదని.. మోటారు వాహనాల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు కనుగొనబడింది. కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్ 2021 ఇప్పుడు ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. బైక్ ట్యాక్సీలను నడపడం గురించి ఆటో, టాక్సీ డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తుతోంది. వీటిలో కొన్ని వాహనాలు మహిళల భద్రతకు కూడా ముప్పుగా మారాయి. దీని కారణంగా శాంతిభద్రతల ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పథకం రవాణా శాఖ పన్ను వసూళ్లపై కూడా ప్రభావం చూపుతోంది.
తరచూ ఆటోరిక్షాల యజమానులు, డ్రైవర్లతో ‘మ్యాక్సీ క్యాబ్స్’ డ్రైవర్లకు గొడవలు జరిగి కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. బైక్ ట్యాక్సీ ల వల్ల రవాణా శాఖకు పన్ను సేకరణ కష్టంగా మారిందని చెప్పింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ పథకాన్ని దుర్వినియోగం చేయడం వల్ల శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారడంతో పాటు మహిళల భద్రతకు ముప్పు వాటిల్లిందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు పలువురు అధికారులు తెలిపారు. బైక్ ట్యాక్సీ పథకం లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు, బైక్‌లు టాక్సీలుగా నడుస్తున్నాయి.
బైక్ ట్యాక్సీలు ఆదాయాన్ని పెంచడంలో పెద్దగా సహాయపడలేదని, అందుకే ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలిపింది. 36 ప్రైవేట్ రవాణా సంఘాల మద్దతుతో, కర్ణాటక స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్స్ గత ఏడాది బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తామని రవాణా మంత్రి రామలింగారెడ్డి హామీ ఇవ్వడంతో దానిని విరమించుకున్నారు.