Karnataka H C:ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు
బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధమన్న కర్ణాటక హైకోర్టు;
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. రాబోయే ఆరు వారాల్లో రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని వెల్లడించింది. అయితే బైక్ ట్యాక్సీ సేవలను 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ కిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది.
రైడ్-హెయిలింగ్ సేవల ఆపరేటర్లు.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించకపోవడం మాత్రమే కాకుండా, మోటార్ వాహన చట్టాలను కూడా ఉల్లంఘించారు. కొందరు బైక్ ట్యాక్సీ డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 93ని అనుసరించి.. కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకూ, ఈ నిషేధం అమలులో ఉంటుంది. అప్పటి వరకు ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదు. వైట్ నెంబర్ ప్లేట్ కలిగిన టూ వీలర్స్ కమర్షియల్ వినియోగానికి అనుమతి లేదు. కాబట్టి బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధం. అయితే దీనికి సరైన చట్టబద్దత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా గుర్తించడానికి కావాల్సిన అనుమతులను ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేము. దీనికి సరైన చట్టం అవసరం అని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఇక ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిలిపివేయడంతో.. నగరవాసులు చాలా ఇబ్బందులుపడే అవకాశం ఉంది.