Karnataka : 2,800 వీధి కుక్కలను చంపించా, జైలుకు వెళ్లేందుకు సిద్ధం!: కర్ణాటక ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

పిల్లల భద్రతే ముఖ్యం, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్న జేడీఎస్‌ ఎమ్మెల్సీ భోజెగౌడ;

Update: 2025-08-13 23:35 GMT

దేశంలో వీధి కుక్కల సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎమ్మెల్సీ ఎస్.ఎల్. భోజేగౌడ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. పిల్లల భద్రత కోసం ఏకంగా 2,800 వీధి కుక్కలను చంపించామని, ఇందుకోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ఆయన శాసనసభలో ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

చిక్‌మగళూరు స్థానిక సంస్థకు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని భోజేగౌడ తెలిపారు. "మాంసంలో ఓ పదార్థం కలిపి 2,800 కుక్కలకు తినిపించాం. అనంతరం వాటిని కొబ్బరి చెట్ల కింద పాతిపెట్టాం" అని ఆయన వివరించారు. తమకు జంతువులపై ప్రేమ ఉన్నప్పటికీ, జంతు ప్రేమికులు మరో సమస్యగా మారారని, పిల్లలపై కుక్కల దాడుల వార్తలు చూసి చలించిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

భోజేగౌడ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ క్యాంపస్‌లో ఇద్దరు ఎమ్మెస్సీ విద్యార్థులపై, కోడిగేహళ్లిలో 70 ఏళ్ల వృద్ధుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, పాత హుబ్బళ్లిలోని షిమ్లా నగర్‌లో మూడేళ్ల బాలికపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది.

ఈ సమస్యపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) తీరుపై కర్ణాటక లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దూకుడుగా ఉండే కుక్కల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను బీబీఎంపీ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు, వీధి కుక్కల అంశం సుప్రీంకోర్టుకు చేరగా, ఈ సమస్యను పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హామీ ఇచ్చారు. ఈ వివాదం జంతు హక్కుల కార్యకర్తలు, పౌరుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

Tags:    

Similar News