Free Bus: మహిళలకు ‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన..
ఏడాదిన్నరకే.. ఉచిత బస్సుకు కాంగ్రెస్ సర్కారు షాక్!;
కర్ణాటక మహిళలకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇవ్వనుంది. గ్యారెంటీల పేరుతో ఆకర్షించి ఓట్లు వేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉచిత పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆడంబరంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకానికి ఏడాదిన్నరకే మంగళం పాడుతున్నది. ఈ పథకాన్ని నిలిపేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. మహిళలే ఈ పథకం వద్దంటున్నారని చెప్తూ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నది. బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. చాలా మంది మహిళలు తాము బస్సు టికెట్లకు డబ్బులు కడతామని చెప్తూ ప్రభుత్వానికి సోషల్ మీడియా, ఈమెయిళ్ల ద్వారా చెప్తున్నారని డీకే శివకుమార్ పేర్కొన్నారు. అందుకే రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో త్వరలోనే సమావేశమై చర్చిస్తానని చెప్పారు.
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే పార్లమెంటు ఎన్నికలు ముంచుకురావడంతో గెలిచిన వెంటనే పథకాలను అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘శక్తి’ పేరుతో గత ఏడాది జూన్ 11 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే, ఉచిత పథకాల వల్ల రాష్ట్రంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే పన్నులను పెంచుతూ ప్రజలపై భారాన్ని వేస్తున్నది. గ్యారెంటీల వల్ల అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి.
ఉచితాలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పథకాలు ఓట్లు కురిపించలేదు. దీంతో ఉచితాలు ఆపేయాలని, సమీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బహిరంగంగానే కోరుతూ వస్తున్నారు. దీంతో ఒక్కో పథకానికి కత్తెర పెట్టేందుకు సర్కారు సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తున్నది. మొదటి వేటు ఉచిత బస్సు పథకంపై పడే అవకాశం ఉంది. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏడాదిన్నరలో రూ.7,507.35 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఆపేసి మహిళలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.