Karnataka: తాళి కట్టిన వెంటనే గుండెపోటుతో వరుడు మృతి
కర్ణాటక బాగల్‌కోట్‌లో విషాదం..;
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలోనే వరుడు మృతి చెందాడు. నిండు నూరేళ్లు కలిసి ఉండాలని బంధువులు ఆశీర్వదించిన కొద్దిసేపటికే పెళ్లి మండపంలోనే కుప్పకూలాడు. మంగళసూత్రం వధువు మెడలో కట్టిన వెంటనే, 25 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెళ్లికి వచ్చిన వారితో పాటు అందర్ని షాక్‌కు గురిచేసింది.
శనివారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జమ్ ఖండి పట్టణంలో ఈ విషాదం జరిగింది. వరుడు ప్రవీణ్ తాళి కట్టిన కొన్ని నిమిషాలకే ఛాతి నొప్పితో నేలపై కుప్పకూలాడు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పును సూచిస్తోంది.
మృతుడు ప్రవీణ్ జామఖండి తాలూకాలోని కుంబరహల్లా గ్రామ నివాసి. అతను ప్రస్తుతం జామఖండి నగరంలో నివసిస్తున్నాడు. వధువుది బెల్గాం జిల్లా అథని తాలూకాలోని పార్థనహళ్లి గ్రామం. ఆ వధువు ప్రవీణ్ మామ కూతురు.అందమైన జీవితం గడపాల్సిన ఈ జంట సంతోషం కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. ఈ సంఘటనతో పెళ్లికి వచ్చినవారు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి కూతురు కుటుంబం కన్నీరమున్నీరవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవకిలో ఇలాగే మధ్యప్రదేశ్‌లో ఒక వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో 23 ఏళ్ల యువతి గుండెపోటుకు గురై మరణించింది. గత డిసెంబర్ యూపీ అలీఘర్‌లో పాఠశాలలో పరుగుల పోటీలో పాల్గొన్న 14 ఏళ్ల బాలుడు గుండెపోటుకు గురై మరణించాడు.