KARNATAKA: కర్ణాటకలో అవినీతి లేఖ కలకలం.. సీఐడీ దర్యాప్తు
లంచం ఇవ్వాలని మంత్రి వేధిస్తున్నాడని గవర్నర్‌కు అధికారుల లేఖ... అది నకిలీ లేఖన్న ముఖ్యమంత్రి... మండిపడ్డ ప్రతిపక్షాలు;
కర్ణాటకలో (Karnataka) సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలైనా కాకుముందే అవినీతి ఆరోపణలు (Corruption) గుప్పుమన్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రే లంచం కోసం అధికారులను వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై కొందరు ఉన్నతాధికారులు గవర్నర్‌కే ఫిర్యాదు చేస్తూ ‘లేఖ’ రాయడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే, ఆ లేఖ నకిలీదని పేర్కొన్న సిద్ధరామయ్య సదరు మంత్రిపై వచ్చిన ఆరోపణలు, లేఖ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు (CID Probe) చేయాలని ఆదేశించింది.
వ్యవసాయశాఖ మంత్రి ఎన్ చలువరాయ స్వామి( agriculture minister N Cheluvarayaswamy) లంచం ఇవ్వాలని తమను వేధిస్తున్నాడని, రూ.6-8 లక్షలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తున్నారని మండ్య జిల్లా వ్యవసాయశాఖ(agriculture department in Mandya )కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, అధికారులు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, అవినీతిని ఆపాలని, మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే విషం తాగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప, తమకు మరో దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు రాసినట్లు ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి అవినీతి ‘సంప్రదాయాన్ని’ నియంత్రించకుంటే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడతామని బాధితులు హెచ్చరించారు. ఆ లేఖను చీఫ్ సెక్రటరీ వందితా శర్మకు పంపించిన గవర్నర్ గహ్లోత్ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
ఈ ‘లేఖ’ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అది నకిలీదని పేర్కొన్నారు. భాజపా, వారి మిత్రపక్షం దానిని సృష్టించాయని ఆరోపించారు. అయినా మంత్రిపై వచ్చిన ఆరోపణల కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన సిద్ధరామయ్య.. ఆ లేఖ నకిలీదని, అటువంటి లేఖను ఏ అధికారి రాయలేదని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ చెప్పారని అన్నారు. అటు ఈ వ్యవహారంపై భాజపా, జేడీఎస్‌తోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీలు మండిపడ్డాయి. సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. ఒకవేళ అది నకిలీదైతే గవర్నర్ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించాయి. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని సీఎం వెనకేసుకురావడం దారుణమని దుయ్యబట్టాయి.
తనపై వచ్చిన ఆరోపణలను చలువరాయ స్వామి ఖండించారు. డైరెక్టర్లు రాసిన లేఖ ఫేక్ అని, ఇది తనను అప్రతిష్ఠ పాల్జేసే ప్రయత్నాల్లో భాగమని అన్నారు. విచారణ చేయాలని సీఎంతో పాటు మండ్య జిల్లా ఎస్పీ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను కోరానని తెలిపారు.