Karur Stampede: నేడు హైకోర్టులో టీవీకే పిటిషన్‌పై విచారణ
పథకం ప్రకారం కుట్ర జరిగినట్లు పిటిషన్
నేడు మద్రాసు హైకోర్టులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పిటిషన్‌పై విచారణ జరగనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సోమవారం టీవీకే పిటిషన్ వేసింది. పథకం ప్రకారం జరిగిన కుట్ర అనే అనుమానాన్ని టీవీకే న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించాలని టీవీకే న్యాయవాదులు విన్నవించారు. ఆ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ జరపనుంది.
వేలుస్వామిపురం వద్దకు తమిళ వెంట్రికళగం అధినేత విజయ వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్‌లు రావడం, ఓ చోట లాఠీచార్జ్ జరిగినట్టు వీడియోలు ఉండడం సహా దళపతి వాహనంపైకి రాళ్లు రువ్వినట్టుగా వచ్చిన సంకేతాలను టీవీకే న్యాయవాద విభాగం తీవ్రంగా పరిగణించింది. కరూర్ ఘటన ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తూ.. టీవీకే న్యాయవాదుల బృందం చెన్నై అడయార్ నివాసంలో న్యాయమూర్తి దండపాణిని కలిశారు. కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. కరూర్ ఘటన కేసును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించి విచారించాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని న్యాయమూర్తి తెలపడంతో టీవీకే మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఇక కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. విజయ్ సభ రోజు గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందిన సుగుణ (65) అనే మహిళ సోమవారం మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో ఇంకా 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అందరూ కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. మొత్తంగా 110 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. సోమవారం 51 మంది డిశ్ఛార్జి అయ్యారు.