UP: కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా, 3 రెట్ల జీతం పెంపు

యూపీ సర్కార్ కీలక నిర్ణయం..

Update: 2025-09-06 07:00 GMT

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాతో పాటు 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీతాలతో పాటు అదనంగా అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కాశీ విశ్వనాథ ఆలయ ఉద్యోగులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఇతర వర్గాల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటారని వెల్లడించింది. 

ప్రస్తుతం పూజారులకు, ఉద్యోగులకు నెలకు రూ.30,000 అందుతున్నాయి. ఇప్పుడు ఈ జీతాలు మూడు రెట్లు పెంచారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంత స్థాయిలో జీతాలు పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ్ ఒకటిగా ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పరిపాలనను చేపట్టింది. ఆనాటి నుంచి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. యోగి సర్కార్ నిర్ణయం కీలక మార్పు చోటుచేసుకుంది. 

గురువారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మీర్జాపూర్‌లోని కాక్రాహిలో 46 బిఘాల ఆలయ భూమిలో వేద విద్య, శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ ధామ్, శక్తి పీఠం విశాలాక్షి మాత ఆలయం మధ్య ప్రత్యక్ష మార్గాన్ని సృష్టించడానికి భవనాల కొనుగోలుకు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. సారనాథ్‌లోని బేనిపూర్‌లోని సంకట్ హరన్ హనుమాన్ ఆలయ అభివృద్ధి, గోశాల ఆధునీకరణకు కూడా పచ్చజెండా ఊపింది. అప్‌గ్రేడ్ చేసిన కంట్రోల్ రూమ్, ఆధునిక నిఘా కెమెరాలతో ధామ్ దగ్గర భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయనుంది. అదనంగా లడ్డూ ప్రసాదం, రుద్రాక్ష మాలాల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆమోదించింది.

Tags:    

Similar News