KCR: మూడో కూటమిపై వేగం పెంచిన కేసీఆర్.. నేడు ఢిల్లీలో..
KCR: మూడో కూటమిపై వేగం పెంచారు సీఎం కేసీఆర్. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.;
KCR (tv5news.in)
KCR: మూడో కూటమిపై వేగం పెంచారు సీఎం కేసీఆర్. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య ఇదే తొలి భేటీ. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్.. పలు జాతీయ పార్టీల నాయకులను కలుస్తారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ సమావేశమవుతారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో పాలుపంచుకోవాలంటూ రిటైర్డ్ అధికారులను సైతం ఆహ్వానించారు కేసీఆర్.
ఢిల్లీ పర్యటనలో కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్‌తోనూ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆ తరువాత జాతీయ మీడియా ప్రతినిధులతోనూ కేసీఆర్ మీటింగ్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానన్న సీఎం కేసీఆర్.. మొదటిసారి హస్తిన పర్యటన చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కేసీఆర్.
మొన్ననే మహారాష్ట్ర వెళ్లి సీఎం ఉద్ధవ్ థ్రాకే, శరద్ పవార్‌ను కలిసొచ్చారు. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలుస్తున్నారు. మరోవైపు కేసీఆర్ తరపున వివిధ పార్టీల నేతలతో ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగడతానన్న కేసీఆర్.. ఆ ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేశారు. రెండ్రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా సీఎం కేసీఆర్‌ను కలిశారు.
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్ కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురూ దాదాపు 8 గంటల పాటు మాట్లాడుకున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆనాటి భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఉంటారని తెలుస్తోంది. కేజ్రీవాల్‌ను, మరికొందరు జాతీయ నేతలను కలవడం వెనక కారణం.. థర్డ్ ఫ్రంట్‌ను వీలైనంత త్వరగా తెరమీదకి తీసుకురావడమేనని చెబుతున్నారు.