Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్
ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో ప్రారంభమైన పూజలు;
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. ఈ నెల 10న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల పూజల కోసం తెరుచుకుంటాయి.
శివ భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయ వద్ద బీకేటీసీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయం వెల్లడించారు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ శీతాకాలం మూతపడతాయి.
ఏటా పెద్ద ఎత్తున భక్తులు కేదార్ నాథ్ క్షేత్రానికి వెళ్తుంటారు. గత ఏడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనుందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయని అజయ్ తెలిపారు. త్వరలోనే ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తుందని ఆయన చెప్పారు. ఓంకారేశ్వర్ ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో ఫ్రాంటియర్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు చండీ ప్రసాద్ భట్ పచ్‌గై, కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు ధామ్ రావల్ భీమశంకర్ లింగ్ పాల్గొన్నారు.