Kejriwal : బీజేేపీలో చేరితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల ఆఫర్ : కేజ్రీవాల్
Kejriwal : కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.;
Kejriwal : కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. దీన్ని బలపరుస్తూ... కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆప్‌లో చీలికలు తెచ్చి సర్కార్‌ను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆప్ నేతల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీంతో తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం కేజ్రీవాల్. గురువారం జరిగిన ఈ కీలక సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉండగా ...53 మంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరయ్యారు.
ఏడుగురు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాలకు వెళ్ళారని, మంత్రి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారని, మరొకరు ఫోన్ ద్వారా పాల్గొన్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడిన 12 మంది ఎమ్మెల్యేలు తమను బీజేపీ నేతలు సంప్రదించినట్లు వెల్లడించారు. బీజేపీలో చేరితే ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం... సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని.. ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చినా... 800 కోట్లు అవుతుందన్నారు. ఇంత డబ్బు బీజేపీకి ఎక్కడనుంచి వచ్చిందని ప్రశ్నించారు కేజ్రీవాల్. అది జీఎస్టీ లేక పీఎం కేర్స్ నుంచి తీసిన డబ్బా చెప్పాలన్నారు. లేదా వారి మిత్రులు ఇచ్చిన ధనమా అంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ విఫలమైందన్న కేజ్రీవాల్... తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారన్నారు.
మరోవైపు ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో... సీఎం కేజ్రీవాల్ ఇవాళ ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ప్రతి శుక్రవారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సెనాతో జరిగే సీఎం కేజ్రీవాల్ మీటింగ్ రద్దైంది. ఆప్ మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే... ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదంతా కేజ్రీవాల్ పబ్లిక్ స్టంట్ అని కొట్టిపారేసింది. లిక్కర్ స్కాం బయటికి రావడంతోనే....ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే… ఢిల్లీ రాజకీయాలు మాత్రం శరవేగంగా మారిపోతున్నాయి. మరి ఇది ఎక్కడికి దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.