Plastic Water Bottle: పెళ్లిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బ్యాన్..ఎక్కడంటే..?

హైకోర్టు సంచలన ఆర్డర్స్;

Update: 2025-03-11 00:18 GMT

ప్రపంచాన్ని పట్టిపీడస్తున్న పెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం ఒకటి. ప్లాస్టిక్ భూమిలో త్వరగా కలిసిపోకుండా వందల సంవత్సరాలు ఉంటుంది. తద్వారా పర్యావరణ కాలుష్యం జరిగి అన్ని జీవరాశులకు పెద్ద ప్రమాదం పొంచిఉంది. భూమి, సముద్రం ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి. అయితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాయి. కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం పెరిగిపోతుంది.

నీళ్లు తాగడం మనిషికి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. వేసవికాలం వచ్చిందంటే ప్రతీరోజూ కనీసం నాలుగు లీటర్ల మేర మంచినీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఆఫీసు, ఇల్లు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పెండ్లి వేడుకల్లో, ఇతర ఫంక్షన్లలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో వివాహ విందుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ విందు వేడుకల్లో చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వాడరాదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వివాహ విందు వేడుకల్లో చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వాడరాదంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని స్పష్టం చేసింది. పునర్వినియోగ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్యానించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 అమలుపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ మేరకు కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రభుత్వం తెలిపింది. 100 మందికి మించి పాల్గొనే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ అనుమతులను స్థానిక యంత్రాంగాలే జారీ చేస్తాయని కోర్టుకు వివరించింది.

Tags:    

Similar News