జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 13వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 14నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 16నామినేషన్ల ఉపసంహరణకు ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అక్టోబర్ 24న సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
2021 నుండి ఈ నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ కాశ్మీర్, లడఖ్) విభజించిన తర్వాత అక్కడ శాసనసభ లేదు. రాజ్యసభ సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. శాసనసభ లేనందున ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఓటర్లు అందుబాటులో లేరు. అందువల్ల, ఫిబ్రవరి 2021లో నలుగురు రాజ్యసభ సభ్యుల (గులాం నబీ ఆజాద్, నజీర్ అహ్మద్ లావే, ఫయాజ్ అహ్మద్ మీర్, షంషేర్ సింగ్ మన్హాస్) పదవీకాలం ముగిసిన తర్వాత ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ ఏర్పడింది. దీంతో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఎన్నికలతో దాదాపు నాలుగేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం లభించనుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ఈ నలుగురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.