Mallikarjun Kharge: ప్రధాని విదేశాల పర్యటనలకు వెళ్తున్నారు తప్పితే మణిపూర్‌ని పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
దేశాన్ని పట్టించుకోకుండా ప్రధాని టీవీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారంటూ ఆరోపణలు.;
ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్‌పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
మైసూర్ లో కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఖర్గే ప్రసంగిస్తూ తీవ్ర స్థాయిలో మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని హత్య చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను దేశ ప్రజలు అనుమతించరని అన్నారు. మోడీ రాజ్యాంగం కారణంగా సీఎం, పీఎం అయ్యారని, పార్లమెంట్‌లో ప్రవేశించే ముందు రాజ్యాంగానికి తలవంచారని, కానీ అదే రాజ్యాంగాన్ని ఆయన హత్య చేస్తున్నారంటూ ఆరోపించారు. మణిపూర్‌లో హింస చెలరేగుతున్న ఆయన పట్టించుకోవడం లేదని, మోడీ 42 దేశాలు పర్యటిస్తారు కానీ, సొంత దేశంలో మణిపూర్ లాంటి ప్రాంతాన్ని పర్యటించలేదని, అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ సందర్శించడమే కాకుండా, తన భారత్ జోడో యాత్ర రెండో దశను అక్కడ నుంచే ప్రారంభించారని పొగడ్తలు కురిపించారు. భారతదేశం సమానత్వం పరంగా అగ్రదేశాల సరసన ఉందని మోడీ అనడాన్ని ఎత్తిచూపుతూ.. దేశంలో పేదరికం పెరిగిపోతుందని, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యల్ని ఖర్గే ఉదహరించారు. మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు.