Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీని బెదిరిస్తూ పోస్టు..
12వ తరగతి విద్యార్థి అరెస్టు;
కోల్‌కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ఘటనను ఖండిస్తూ వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి పరిధి దాటి వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా ఆ విద్యార్థి పోస్టు పెట్టారు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ వ్యక్తి బీకాం విద్యార్థి అని, పేరు కీర్తిశర్మ అని పోలీసులు తెలిపారు. తన సోషల్ మీడియా పోస్టులో మమతా బెనర్జీకి హత్య బెదిరింపులు చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ కావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిచెందిన జూనియర్ వైద్యురాలు గుర్తింపు తెలిసేలా.. ఆ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు చెప్పారు. బెదిరింపు పోస్టు.. రెచ్చగొట్టేదిగా, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేదిలా ఉందని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ హత్యాచార ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించారు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను సీబీఐ విచారించాలంటూ బహిరంగంగా డిమాండ్ చేసిన తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌కు సమన్లు ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల వరకు అక్కడికి స్నిఫర్ డాగ్స్‌ను ఎందుకు తీసుకువెళ్లలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు ఆయన్ను విచారణకు పిలిచిన నేపథ్యంలో తనను అరెస్టు నుంచి రక్షించాలంటూ రాయ్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
బెంగాల్ హత్యాచార ఘటనను ఖండిస్తూ వైద్యసిబ్బంది చేస్తోన్న నిరసనలు కొనసాగుతున్నాయి. వారు దిల్లీలోని నిర్మాణ్ భవన్ (కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యాలయం) వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ రోగులకు రోడ్డు పైనే ఓపీ సేవలు అందించారు. మరోవైపు.. అభయకాభాయ్ పేరిట ఈ రాఖీ పండగ చేసుకున్నారు. ఈ రోజున కొందరు చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకోగా.. మరికొన్నిచోట్ల వైద్యసిబ్బంది రోగులకు రాఖీ కట్టారు.