కోటా కోచింగ్ సెంటర్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కోటా కోచింగ్ సెంటర్లో విద్యార్థుల ఆత్మహత్యలు దేశం యావత్తుని వణికిస్తోంది.;
కోటా కోచింగ్ సెంటర్లో విద్యార్థుల ఆత్మహత్యలు దేశం యావత్తుని వణికిస్తోంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న విద్యార్థులకు మానసిక సహాయాన్ని అందించడానికి అక్టోబర్ వరకు అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కోచింగ్ సెంటర్ యాజమాన్యం తెలిపింది. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు రెండు నెలల పాటు పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధించారు.
కోటాలో వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న ఇద్దరు యువకులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కోటా పట్టణంలో విద్యార్థుల మరణాల సంఖ్య ఈ సంవత్సరం 23కి చేరుకుంది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆదివారం తప్పనిసరి సెలవు ఇవ్వాలని, ఆ రోజు ఎలాంటి పరీక్షలు ఉండకూడదని కలెక్టర్ యాజమాన్యాన్ని కోరారు.
"కోటా ఫ్యాక్టరీ"గా ప్రసిద్ధి చెందిన కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు స్నేహితులు ఎవరూ ఉండరు. పోటీదారులు మాత్రమే ఉంటారు. ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్‌లో శనివారం యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతోంది. విద్యార్థిని ఈ ఏడాది జూన్ నుంచి బాలికల హాస్టల్‌లో ఉంటూ యూపీఎస్సీ సీఎస్‌ఈ పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఆన్‌లైన్‌లో తరగతులు తీసుకుంటోంది. తమకు ఓ నోట్ దొరికిందని, దానిని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.