JK: ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టిన భారత బలగాలు
ఇద్దరు సైనికులకు గాయాలు... అడవిలోకి పారిపోయిన ముష్కరులు;
జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. డోడా జిల్లాలోని జడ్డన్ బాటా గ్రామంలో భద్రతా బలగాలు తాత్కాలికంగా బస చేస్తున్న ఓ ప్రభుత్వ పాఠశాలలోని శిబిరంపై మిలిటెంట్లు తుపాకులతో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో సైనికులపై కాల్పులు జరిపిన ముష్కరులు ఆపై దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. దెస్సా అటవీ ప్రాంతంలో నలుగురు సైనికుల మరణానికి కారణమైన కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ డోడాలో ముష్కరుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
. దోడా జిల్లాలో జూన్ 12 నుండి నిరంతర దాడులు జరుగుతున్నాయి. చటర్‌గాలా కనుమ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరుసటి రోజు గండోలో కాల్పులు జరిపి ఒక పోలీసు గాయపడ్డాడు. జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, జూలై 9న గాధి భగవా అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ ప్రావిన్స్‌లోని ఆరు జిల్లాల్లో దాదాపు డజను మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలే జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ భగం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.జమ్మూకశ్మీర్‌లో గత కొద్దివారాలుగా పలు చొరబాటు యత్నాలు, టెర్రరిస్టు దాడులు చోటుచేసుకున్నాయి. అమర్‌నాథ్ వార్షిక యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు జమ్మూకశ్మీర్ బేస్ క్యాంపునకు వస్తుండటంతో ఉగ్రవాదులు తెగబడుతున్నారు.