బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ పేరును జన్ శక్తి జనతా దళ్ గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. బిహార్ లో దీర్ఘకాలిక పోరాటం కోసం తన పార్టీ కృషి చేస్తుందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. పార్టీ ఎన్నికల చిహ్నంగా బ్లాక్ బోర్డ్ ను ప్రకటించారు. అయితే, ఎన్నికల సంఘం వర్గాలు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ లేదా చిహ్నం కేటాయింపు గురించి ఇప్పటివరకు తమకు సమాచారం లేదని తెలిపాయి. ఆగస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన నాయకత్వంలో ఐదు చిన్న పార్టీల కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీని ప్రకటించారు. కుటుంబ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి తెస్తున్నారనే కారణంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ను RJD అధినేత, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించారు. ఇంట్లో సైతం స్థానం లేదని పేర్కొన్నారు. బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి.