Lashkar-e-Taiba:స్థావరాన్ని మారుస్తున్న పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ..

పాకిస్తాన్‌లోని మురిడ్కే నుంచి బహవూల్పూర్‌కు లష్కరే తోయిబా ఆఫీస్..;

Update: 2025-07-19 06:15 GMT

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబాతో పాటు టీఆర్ఎఫ్ రెండూ కూడా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని మురిడ్కే నుంచి దాదాపు 400 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్‌కు మారుస్తున్నట్లు సమాచారం.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ మురిడ్కే లోని లష్కరే స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడి చేసింది. బహవల్పూర్‌లోని జైషే హెడ్‌క్వార్టర్‌పై కూడా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. ప్రస్తుతం, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు కూడా ఒకే చోట తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ సైన్యం చర్యలను భారత నిఘా వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఏర్పాటైంది. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పనిచేసే ఓ తిరుగుబాటు సంస్థగా తనను తాను చెప్పుకుంది. ఈ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. కాశ్మీరేతరులు, సాధారణ కూలీలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. ఆ తర్వాత, సైన్యం, పౌరులపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇది ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సంస్థల నుంచి తప్పించుకోవడానికి, అంతర్జాతీయ నిషేధాన్ని నివారించడానికి తిరుగుబాటు అనే ముసుగును ధరించింది.

పహల్గామ్ దాడి పాకిస్తాన్ స్వదేశీ తిరుగుబాటు ముసుగులో కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాద సంస్థలకు రీబ్రాండ్ చేయడం, స్థానిక పోరాటం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడటం వంటి వ్యూహాలను పాకిస్తాన్ రూపొందించింది. ఇలాంటి చర్యలకు టీఆర్ఎఫ్ ఒక ఉదాహరణ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ సైన్యం సూచనల మేరకు, ముఖ్యంగా ఆసిమ్ మునీర్‌ ప్రత్యక్ష సూచనలతో పనిచేస్తుందని భారత్ గుర్తించింది. పాకిస్తాన్‌లో అశాంతి, తనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మునీర్ పహల్గామ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News