BR Gavai: సుప్రీంకోర్టులోకి ఆ న్యాయవాది ఎంట్రీ రద్దు
సీజేఐ గవాయ్‌పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన న్యాయవాదిపై కఠిన చర్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై ఓ న్యాయవాది చెప్పుతో దాడి చేసేందుకు యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్ ని సస్పెండ్ చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయవాది రాకేష్ కిశోర్‌కు సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది.
రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటూ సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. సీజేఐపై న్యాయవాది రాకేష్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది.
ఈనెల 6వ తేదీన ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్‌పై ఓ న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు. లాయర్లు కేసుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. న్యాయవాది రాకేష్ కిశోర్ వేదిక వద్దకు వెళ్లి తన బూట్‌ను తీసి సీజేఐపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో అతడు ‘సనాతన ధర్మానికి అవమానాన్ని సహించం’ అని గట్టిగా అరిచారు. అయితే దీనిపై సీజేఐ గవాయ్ చలించకుండా వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. ‘ఇలాంటి వాటితో కలవరపడకండి. మేం కలవరపడలేదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కోర్ట్ భద్రతా యూనిట్ విచారణ ప్రారంభించింది.