BJP: మార్చి 11న బిజేపి రెండో జాబితా

ఈ నెల 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ;

Update: 2024-03-09 00:30 GMT

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నబిజేపి ర్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తొలి జాబితా ప్రకటించడంతో.. రెండో జాబితా ఎప్పుడు ప్రకటిస్తారోనన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటంతో రెండో జాబితాపై అందరూ దృష్టిసారించారు.

రాష్ట్రం లోని  17లోక్‌సభ స్థానాలకుగానూ ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. రెండో జాబితాలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా? లేక కొన్ని స్థానాలకే ప్రకటించాలా? అనే సందిగ్ధంలో పడింది. కొన్ని లోక్ సభ స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పిరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా చేరికలు పూర్తయితే మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.... ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని పార్టీ యోచిస్తోంది. 

ఇటీవల ప్రకటించిన తొలిజాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు నేతలు టికెట్ దక్కించుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? లేక పాత వారికే టికెట్‌ కేటాయిస్తారా? అన్న ప్రశ్న అందరిలో ఉంది. జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలె భాస్కర్... మెదక్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. భాస్కర్‌ తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆయన మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్‌కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి టికెట్‌ను పార్టీ సీనియర్ నేత, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ సైతం ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండో జాబితాలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి... ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు చేరాక... ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, పెద్ధపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరి అధిష్ఠానం పార్టీ సీనియర్లకు పెద్దపీట వేస్తుందా.... లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తుందా అన్నది వేచి చూడాలి.

త్వరలో దిల్లీలో బిజేపి  కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే అవకాశముందని సమాచారం. ఈ సమావేశం తర్వాత ఏ క్షణమైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేరికలను త్వరగా పూర్తిచేసి... ఎన్నికల ప్రచారంపై దృష్టిపెట్టాలని రాష్ర్ట నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది

 

Tags:    

Similar News