Panchayat Parliament 2.0: దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని గిరిజన మహిళాలకు పార్లమెంట్ సెషన్స్..
ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 502 మంది ఎస్టీ మహిళా ప్రతినిధులు;
దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్‌సభలో స్టార్ట్ కానుంది. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అవగాహన సదస్సును ఆరంభించనున్నారు. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన 502 మంది మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వారంతా కొత్త పార్లమెంటు, సంవిధాన్ సదన్, ప్రధాన మంత్రి సంగ్రహాలయం, రాష్ట్రపతి భవన్‌లను సందర్శిస్తారు.
అయితే, పంచాయతీరాజ్ వ్యవస్థలోని షెడ్యూల్డ్ తెగల నుంచి ఎన్నికైన మహిళా ప్రతినిధులకు అధికారం కల్పించడంతో పాటు సమర్థవంతమైన నాయకత్వాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ విధానాలు, పాలనపై జ్ఞానాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. విద్య, గ్రామీణాభివృద్ధి మొదలైన విభిన్న రంగాలలో ఎస్టీ మహిళా ప్రతినిధులు చేసిన ప్రతిభను గుర్తించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తదితరులు పాల్గొంటారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ స్వాగతోపన్యాసం చేస్తారు.