Agnipath Scheme: అగ్నిపథ్‌పై త్రివిధ దళాల కీలక ప్రకటన.. సంస్కరణలు ప్రారంభించామంటూ..

Agnipath Scheme: అగ్నిపథ్‌పై ఆందోళనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది.

Update: 2022-06-19 15:45 GMT

Agnipath Scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది. అగ్నిపథ్‌ రద్దు చేయాలని యువకులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. పథకాన్ని కొనసాగించేందుకే కేంద్రం నిర్ణయించింది. రెండోరోజు త్రివిధ దళాలతో సమీక్షించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.. ఆర్మీలో ఖాళీలను గుర్తించి నియామకాల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలతో త్రివిధ దళాలు కీలక ప్రకటన చేసాయి. ఇకపై ఆర్మీలో రెగ్యులర్ నియామకాలు ఉండవని తేల్చిచెప్పాయి.

త్రివిధ దళాల్లో సంస్కరణలు ప్రారంభించామని లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌ పూరి స్పష్టంచేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్‌లో ఉందని.. సైన్యంలో సగటు వయస్సును తగ్గించేందుకే సంస్కరణలు చేపట్టామన్నారు. అయితే దేశంలో కరోనా పరిస్థితుల వల్ల అగ్నిపథ్‌ అమలులో ఆలస్యమైందన్న లెఫ్టినెంట్ జనరల్.. బలగాల్ని యువకులతో నింపాలన్నదే అగ్నిపథ్‌ లక్ష్యమని తెలిపారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర కాగా.. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుందన్నారు.

అగ్నిపథ్ అమలులో సాధకబాధల్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్న లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌ పూరి..పోలీస్ విభాగంలోకి అగ్నివీరులను తీసుకునేందుకు నాలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. అగ్నిపథ్‌కు లోబడే ఇకపై త్రివిధ దళాల్లో నియామకాలు చేపడతామని ఎయిర్‌మార్షల్ ఎస్‌కే ఝా అన్నారు. అయితే విధ్వంసాలకు పాల్పడే వారికి సైన్యంలో చోటు లేదని స్పష్టంచేశారు. ఇండియన్ ఆర్మీ క్రమశిక్షణకు మారుపేరని.. ట్రైనింగ్ సెంటర్ మాయలో పడి యువకులు విధ్వంసాలకు పాల్పడొద్దని సూచించారు.

నిరసనకారుల ఫొటోలను గుర్తించడం ఈజీ అన్న ఎయిర్‌మార్షల్ ఎస్‌కే ఝా.. ఆందోళనలో పాల్గొన్నవారి ఫొటోలను త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. మరోవైపు.. వీలైనంత తొందరగా అగ్నిపథ్ం రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్ నియామకాలకు ఈనెల 24 నోటిఫికేషన్ విడుదల చేస్తామని త్రివిధ దళాధిపతులు తెలిపారు. జులై 24న రాతపరీక్ష నిర్వహించి డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్‌కు శిక్షణ ఇస్తామన్నారు. అలాగే నేవీలో ఖాళీల భర్తీపై ఈనెల 25 వరకు ప్రకటన చేస్తామని వెల్లడించారు.

ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించామన్న త్రివిధ దళాధిపతులు.. అగ్నివీర్‌లు సైన్యంలో కొనసాగే వీలుందని స్పష్టంచేశారు. అగ్నిపథ్‌పై కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సౌత్, నార్త్, ఈస్ట్ అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు అగ్నిపథ్ నిరసనజ్వాలలు తాకుతున్నాయి. ఇపుడు కేంద్రం అగ్నిపథ్‌కు నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆందోళనలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News