భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన కేసులో లక్నో లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. మార్చి 24న తమ ముందు హాజరు కావాలని రాహుల్ ను ఆదేశించింది. 'భారత్ జోడో యాత్ర సందర్భంగా డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో భారత ఆర్మీని అవమానించారని శ్రీవాస్తవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆర్మీపై రాహుల్ వ్యాఖ్యలు తగవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు రాహుల్ కు తాజాగా సమన్లు జారీ చేసింది.