Madhya Pradesh: తండ్రి మృతదేహం సగం కోసివ్వమన్నాడు
అంత్యక్రియల కోసం గొడవపడ్డ సోదరులు;
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో తమ్ముడితో తలెత్తిన వివాదం కారణంగా తండ్రి మృతదేహంలో సగ భాగాన్ని కోసి ఇవ్వాలని ఓ కొడుకు డిమాండ్ చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దైనీ సింగ్ ఘోష్(84) అనే వ్యక్తి తన చిన్న కొడుకు దేశ్ రాజ్ వద్ద నివసిస్తూ ఆదివారం మృతి చెందాడు.
ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతడి పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి వచ్చాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్‌రాజ్ అన్నకు తెలిపాడు. దీంతో తమ్ముడితో గొడవకు దిగిన కిషన్ తండ్రి శరీరాన్ని సగం కోసి తనకు ఇవ్వాలన్నాడు. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిషన్‌కు సర్ది చెప్పడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దేశ్‌రాజ్ తన తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.