Madhya Pradesh: ఆ నకిలీ వైద్యుడు దొంగ కూడా
5 వేల హార్ట్ సర్జరీలు.. ఏడుగుర్ని బలిగొన్నఫేక్ UK డాక్టర్.;
లండన్ వైద్యుడినని నమ్మించి, మోసపూరిత ఆపరేషన్లతో ఏడుగురి ప్రాణాలు తీసిన నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అలియాస్ ఎన్ జాన్ కామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ ఆసుపత్రిలో ఇతని నేరాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తూ, ప్రాణాలు తీసిన ఈ ఘటన వైద్య రంగంలో కలకలం రేపింది. నిందితుడిపై ఫోర్జరీ, వైద్య నేరాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతణ్ని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్ట్ చేశారు. అయితే నిందితడు నకిలీ వైద్యుడిగా చెలామణి అవడంతో పాటు పనిచేస్తున్న ఆస్పత్రిలోనే దొంగతనాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
నిందితుడు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దామోహ్ ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో విధులు నిర్వహించాడు. ఈక్రమంలో నిందితుడు తమ ఆస్పత్రి పరికరాలను దొంగిలించాడని అక్కడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5-7లక్షల విలువైన పోర్టబుల్ ఎకో మిషన్‌ను దొంగిలించాడని అందులో పేర్కొన్నారు. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దొంగతనాలకి నరేంద్ర మరో వ్యక్తి సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. అతడి నకిలీ డాక్టర్ సర్టిఫికెట్‌కు సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. అతడి వద్ద ఉన్న ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ నంబరు ఒక మహిళా డాకర్ట్‌కు చెందినదిగా తెలుస్తోంది. అతడి మొబైల్, ట్యాబ్, ఈ-మెయిల్ ఆధారంగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక, నకిలీ వైద్యుడి నియామకంపై వివరణ ఇవ్వాలని కోరుతూ దమోహ్ ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ప్రమోద్ తివారీ నోటీసులు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్‌గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ శుక్లాతో పాటు మరి కొంతమంది రోగుల మరణాల నేపథ్యంలో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు.
ఎన్ జాన్ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు దమోహ్ పట్టణంలో ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు అతడు వైద్యుడే కాదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎన్ జాన్ కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్టుగా చెలామణి అవుతున్నట్లు తెలిపారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో మాట్లాడుతూ.. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిపారు. అతడు చేసిన ఆపరేషన్లకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు బ్రిటన్‌లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా కొనసాగుతున్నాడన్నారు. హైదరాబాద్‌లోనూ అతడిపై పలు కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు. మృతులు ఏడుగురు అని బాధితులు చెప్తున్నప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.