Ilayaraja: మద్రాస్ ఐఐటీలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం
సంగీతానికి ఆధునిక సాంకేతికత జోడించనున్న పరిశోధకులు;
తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన సంగీత జ్ఞాని, స్వరమాంత్రికుడు ఇళయరాజా. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యాస్ట్రోకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇళయరాజా పేరిట ఓ మ్యూజిక్ రిసెర్చ్ సెంటర్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రానికి సోమవారం త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా కలిసి శంకుస్థాపన చేశారు.
ఐఐటీఎం డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ సంగీతం గురించి తెలుసుకోవడానికి లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైందని, తద్వారా ఎక్కువ పరిశోధనలు చేయగలిగే వీలుందని పేర్కొన్నారు. అనంతరం ఇళయరాజా, కామకోటి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. పాత రోజులను ఇళయరాజా గుర్తు చేసుకుంటూ మద్రాస్‌కు సోదరుడితో చిన్నప్పుడు వచ్చానని, ఇప్పటివరకూ ఎవరి వద్దా ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదన్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో ఎవరైనా రాణించవచ్చని యువతకు సూచించారు. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండి.. పట్టుదలతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో రాణించవచ్చని యువతకు సూచించారు. మీరు కూడా నాతో చేరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రపంచ దిగ్గజ సంగీత కళాకారుడు మొజార్టీ శకం ముగిసిన 200 ఏళ్ల తర్వాత ఐఐటీ-మద్రాసు లాంటి సంస్థ 200 మంది ఇళయరాజాలను తయారు చేయాలి. సంగీతం నా ఊపిరి’ అని అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ చాలా ఆలోచనల ఫలితం.. మీరు ప్రపంచమంతటా మీ పరిశోధనలను వ్యాప్తి చేయాలి’ అని విద్యార్థులను ఇళయరాజా కోరారు.
మరోవైపు, ‘స్పిక్‌మాకే’ పేరిట తొమ్మిదో అంతర్జాతీయ సాంస్కృతిక వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇవి వారం రోజులపాటు జరగనున్నాయి.