Agriculture Minister: అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్న వ్యవసాయ మంత్రి..
త్వరలోనే క్యాబినెట్ నుంచి మంత్రిని తొలగిస్తారని ప్రచారం;
మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం తీరిగ్గా అసెంబ్లీలోనే ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ మంత్రి మాణిక్ రావ్ కోకటే రమ్మీ ఆడుతున్న వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులో ఉందని, ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని రోహిత్ పవార్ ఆరోపించారు. పంట బీమా కోసం, రుణమాఫీ కోసం, పంటలకు మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
ఈ సమస్యలతో అప్పులపాలైన రైతులు సగటున రోజుకు ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వ్యవసాయ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని మండిపడ్డారు. మొబైల్ ఫోన్ లో రమ్మీ ఆటను పక్కన పెట్టి అప్పుడప్పుడైనా పంట పొలాల్లోకి వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వివాదంపై బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పనులపై చర్య తీసుకునే ప్రత్యేక చట్టం లేదు. గరిష్ఠంగా హెచ్చరిక ఇవ్వొచ్చు. నేను ఎప్పుడో సీఎం ఫడ్నవీస్‌కి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించాను. కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని అన్నారు’’ అని అన్నారు. అయితే, ఈ సంఘటనను ‘ప్రజాస్వామ్య దేవాలయానికి అవమానం’గా విపక్షాలు అభివర్ణించాయి. కర్ణాటక అసెంబ్లీలో ఇటువంటి ఘటనలు జరిగితే సభ్యులను ఇంటికి పంపారని, కానీ, ఇక్కడ మాత్రం వారు సిగ్గులేకుండా కొనసాగుతున్నారని దుయ్యబడుతున్నాయి.