Assembly elections:నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
మహా సీఎం పీఠం కోసం పోరు మొదలు;
మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలూ శనివారమే వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మహారాష్ట్రలో శనివారం చేపట్టనున్న 288 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు గాను 288 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్న నేపథ్యంలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, డాక్టర్ జి.పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిఖ్ అన్వర్, మల్లు భట్టివిక్రమార్క, కృష్ణ అల్లవూరును ఝార్ఖండ్‌కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి.
ఝార్ఖండ్‌లో అధికార ఝార్ఖండ్ ముక్తి-మోర్చా- కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం శనివారం తేలనుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ భాజపా కూటమికే అధికారం దక్కే అవకాశముందని అంచనా వేశాయి.