Ajit Pawar: నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
సోషల్ మీడియాలో వైరల్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్‌లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు.
మహారాష్ట్రలో పలుచోట్ల వరదలు సంభవించి పంటలు నష్టపోయాయి. గురువారం ధరాశివ్ జిల్లాలోని భూమ్-పరంద తాలుకాలో వరద నష్టపోయిన పొలాలను అజిత్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును అజిత్ పవార్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధిత రైతులకు రుణమాఫీ చేస్తారా? అని ఓ మహిళా రైతు అడిగింది. దీనికి అజిత్ పవార్ మండిపడ్డారు. ‘‘నిన్ను సీఎంను చేయమంటావా?’’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. రైతులకు రుణమాఫీ చేయాలా? వద్దా? అనే విషయం మాకు తెలియదా? మేమేమైనా ఆటలాడడానికి ఇక్కడ ఉన్నామా? అంటూ అజిత్ పవార్ ఎదురు ప్రశ్నించారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి తాను ప్రజల గురించే పని చేస్తానని.. అలాంటిది తననే ప్రశ్నిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘లడ్కీ బహిన్ యోజన’ పథకం కింద రూ.45,000 కోట్లు ఇస్తున్నామని.. రైతులకు విద్యుత్తు ఛార్జీలను మాఫీ చేశామని గుర్తుచేశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,215 కోట్ల సహాయాన్ని ప్రకటించిందన్నారు. ఇంకా తాను పరిశీలించాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల పుణెలోని కేశవ్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో గోవా మాజీ సీఎం, దివంగత నేత మనోహర్ పారికర్ ఎవరంటూ ప్రశ్నించి వార్తల్లో నిలిచారు.