Maharastra: అసెంబ్లీలో ఆడుకోవచ్చు.. ఉన్నపదవి ఊడినా మరోపదవి!!

మహారాష్ట్రకు చెందిన మంత్రి మాణిక్‌రావ్ కోకాటే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో రమ్మీ ఆడుతున్నట్లు తెలియడంతో ఆయనను వ్యవసాయ మంత్రి పదవి నుంచి తొలగించారు.;

Update: 2025-08-01 05:29 GMT

మహారాష్ట్రకు చెందిన మంత్రి మాణిక్‌రావ్ కోకాటే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో రమ్మీ ఆడుతున్నట్లు వీడియోలో కనిపించిన తర్వాత ఆయనను వ్యవసాయ మంత్రి పదవి నుంచి తొలగించి ఈసారి ఆయనకు సూటయ్యే క్రీడా మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వ్యవసాయ మంత్రిగా దత్తాత్రే భర్నే బాధ్యతలు స్వీకరించనున్నారు.

అసెంబ్లీ కార్యకలాపాల సమయంలో కోకాటే ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు చూపించే వీడియో క్లిప్‌ను ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ షేర్ చేయడంతో వివాదం చెలరేగింది . ఈ క్లిప్ రాజకీయంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది, మహారాష్ట్ర తీవ్రమైన వ్యవసాయ సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో మంత్రి కోకాటే తనకేమీ పట్టనట్లు ఉండడంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

"అధికారంలో ఉన్న బిజెపిని సంప్రదించకుండా ఏమీ చేయలేనందున, లెక్కలేనన్ని వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రోజుకు ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ, వ్యవసాయ మంత్రికి వేరే దారిలేక, రమ్మీ ఆడుకుంటున్నారు అని ఎమ్మెల్యే రోహిత్ పన్వర్ X లో ఒక పోస్ట్‌లో వ్యంగ్యంగా అన్నారు. 

కోకాటే ఆరోపణలను ఖండిస్తూ, "ఇది కేవలం 10-15 సెకన్ల పాటు మాత్రమే" అని పేర్కొన్నాడు. తాను గేమ్ ఆడటం లేదని, పాప్-అప్‌ను మూసివేస్తున్నానని చెప్పాడు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా అతను బెదిరించాడు. అయితే, కోకాటే 18 నుండి 22 నిమిషాల పాటు గేమ్‌లో పాల్గొన్నట్లు శాసనసభ దర్యాప్తులో తేలింది - ఇది అతని వాదనకు విరుద్ధంగా ఉందని రోహిత్ పవార్ పేర్కొన్నారు.

కోకాటే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రైతులను బిచ్చగాళ్లతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. 1995 గృహనిర్మాణ మోసం కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. అయినా మరోసారి మంత్రి పదవి అతడిని వరించింది. ప్చ్.. ఇది మన దేశ దౌర్భాగ్యం. 


Tags:    

Similar News