UP: ప్యాంట్‌పై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య- భార్య, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ
యూపీలో పోలీసుల కర్కశత్వం;
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్య, పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడు తన ప్యాంటుపైనే సూసైట్ నోట్‌ను రాశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్యాంట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఫరూఖాబాద్ జిల్లాలోని మౌదర్వాజా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుటాసి గ్రామానికి చెందిన రామ్ రయీస్ కుమారుడు దిలీప్ కుమార్ (25) సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు తన భార్య, పోలీసుల వేధింపులే కారణమని ప్యాంట్‌పై రాశాడు. మంగళవారం ఉదయం దిలీప్ కుమార్ విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సింగ్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్యాంట్‌పై రాసిన సూసైట్ నోట్లో ఏముందంటే?
దిలీప్ కుమార్ చనిపోయే ముందు తన ప్యాంటుపై సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన భార్య ఫిర్యాదు చేసిన తర్వాత, పోలీసు సిబ్బంది యశ్వంత్ యాదవ్, మహేశ్ ఉపాధ్యాయ్ తనపై దాడి చేశారని ఆరోపించాడు. అలాగే తన నుంచి రూ.50,000 డిమాండ్ చేశారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన భార్యతో గొడవ పరిష్కరించుకోవాలని బలవంతం చేశారన్నాడు. దిలీప్ కుమార్ రాసిన సూసైట్ నోట్ రాసిన ప్యాంట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దిలీప్ మామ బన్వారీ లాల్, బావమరుదులు రాజు, రజనేశ్ రాజ్ పుత్‌తో పాటు హథియాపుర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు యశ్వంత్ యాదవ్, మహేశ్ ఉపాధ్యాయ్‌లపై ఎఫ్ ఐఆర్ ఫైల్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ సింగ్ లైన్ డ్యూటీలో ఉంచారు.
దిలీప్ తండ్రి ఫిర్యాదు ప్రకారం
దిలీప్ తండ్రి రామ్ రయీస్ మౌదర్వాజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో తన కొడుకు తన ప్యాంట్‌పై రాసిన సూసైడ్ నోట్ గురించి ప్రస్తావించాడు. దిలీప్‌నకు తన భార్యతో వివాదం ఉంది. ఈ గొడవ గురించి దిలీప్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రోజు పోలీసులు దిలీప్‌ను హథియాపుర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్ దిలీప్ నుంచి రూ. 50,000 డిమాండ్ చేశాడు. కానిస్టేబుల్ మహేశ్ ఉపాధ్యాయ్ రూ.40,000 తీసుకొని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చాడు. ఆ తర్వాత దిలీప్ ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి బంధువుల ఆందోళన
మంగళవారం ఉదయం దిలీప్ విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. మృతదేహాన్ని అంతిమ సంస్కారాలను తీసుకెళ్లడానికి వెనుకాడారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, యువకుడి ఆత్మహత్య గురించి తెలుసుకున్న బీజేపీ నాయకుడు, ఎంపీ ముకేశ్ రాజ్ పుత్ మేనల్లుడు రాహుల్ రాజ్‌పుత్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చాడు.