Uttar Pradeshఅన్నా, వదినల తో ఆనందంగా భోజనం.. అంతలోనే కత్తితో దాడి ఇద్దరు మృతి
యూపీలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
అన్నా, వదినలతో తలెత్తిన గొడవతో.. ఆ తమ్ముడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఉక్రోశంతో ఊగిపోతూ.. వెంటనే ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి మరీ దాడికి పాల్పడ్డాడు. అన్నావదినలను ఇద్దరినీ నరికి చంపేశాడు. వీరిని ఆపేందుకు వెళ్లగా.. మధ్యలో మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కాగా.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా నైమిశారణ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్‌పూర్వ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్‌పూర్వ గ్రామానికి చెందిన 37 ఏళ్ల శ్యాము, 40 ఏళ్ల హరీష్, రాము అన్నదమ్ములు. అయితే ముగ్గురు కొడుకులు, కోడళ్లు వారి పిల్లలతో పాటే తల్లిదండ్రులు కూడా కలిసుంటూ హాయిగా జీవిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఈక్రమంలోనే శ్యాముకు, తన అన్నదమ్ములకు మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది. ఉమ్మడి కుటుంబంలో వచ్చే చిన్నపాటి గొడవలే కదా అని అందరూ భావించారు. మాట్లాడుకుంటూ సమస్య సమిసిపోతుందని భావించారు. కానీ అదే గొడవ ఆ ఇంటిని కకావికలం చేస్తుందిన ఎంతమాత్రమూ గ్రహించలేకపోయారు.
ముఖ్యంగా అన్నదమ్ములిద్దరూ తనతో గొడవ పడడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన శ్యాము ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో ఇంట్లోని పదునైన కత్తిని తీసుకుని తన అన్న హరీష్, తమ్ముడు రాములపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవను చూసి హరీష్ భార్య 35 ఏళ్ల పూనమ్ వారిని వారించే ప్రయత్నం చేసింది. గొడవ ఆపమని వేడుకుంటూ శ్యాముకు అడ్డుగా వెళ్లింది. అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న శ్యాము.. వదనపై కూడా దాడికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణాహరితంగా దాడి చేశాడు. ముగ్గురినీ తీవ్రంగా గాయపరిచిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురినీ.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే నైమిశారణ్యలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే పూనమ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చికిత్స పొందుతూ హరీష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చిన్న తమ్ముడు రాము పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు ఎస్పీ దుర్గేష్ సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్యాముపై కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. చిన్నపాటి గొడవే ఇంతటి దారుణానికి దారితీయడం అత్యంత దురదృష్టకరం అని పోలీసులు పేర్కొన్నారు.