RAHUL: రాహుల్ కాన్వాయ్ నిలిపివేత
మణిపుర్‌లో రాహుల్‌గాంధీ కాన్వాయ్ అడ్డగింత... బద్రత కారణాలతో నిలిపేసిన మణిపుర్ పోలీసులు...;
అల్లర్లతో హింసాత్మకంగా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటిస్తున్నారు. మణిపుర్ చేరుకున్న వెంటనే ఆయన అల్లర్లు చెలరేగిన చురాచాంద్‌పుర్ జిల్లాకు బయలుదేరారు. రాహుల్ అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాలతో మార్గం మధ్యలోనే కాన్వాయ్‌ను నిలిపివేశారు. చురాచాంద్‌పుర్‌కు రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతకు సూచించారు. హింసాత్మక ఘటనలు మళ్లీ జరుగుతాయనే ఆందోళనతోనే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కాన్వాయ్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్‌లో రాహుల్ కాన్వాయ్‌ను నిలిపివేశారు. కాంగ్రెస్ అగ్రనేతను ముందుకు వెళ్లనివ్వలేమని బిష్ణుపూర్ ఎస్పీ తెలిపారు. ఆయన భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు. నిన్న రాత్రి కూడా చురాచాంద్‌పుర్ జిల్లాలో హింస చెలరేగిందని పోలీసులు వివరించారు. ఇవాళ మణిపుర్ చేరుకున్న రాహుల్ ఇంఫాల్, చురాచాంద్‌పుర్ జిల్లాలోని సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శించనున్నారు. అలాగే అక్కడి పౌర సమాజం నేతలతోనూ మాట్లాడనున్నారు.
మైతేయ్-కుకీ జాతుల మధ్య విభేదాలే మణిపుర్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణంగా నిలిచింది. మైతేయ్‌లకు ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీ’ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అప్పటి నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటివల్ల 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 300 శిబిరాల్లో 50 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.
మణిపుర్‌లోని పరిస్థితులపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దాదాపు రెండు నెలలుగా మండుతోన్న మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తోందని హస్తం నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సమాజాన్ని ఘర్షణ నుంచి శాంతి మార్గం వైపు పయనించేలా చేయడం అవసరం హస్తం పార్టీ వెల్లడించింది. ద్వేషంతో కాకుండా ప్రేమగా కలిసి ఉండడం మన బాధ్యతని సూచించింది. ఈశాన్య రాష్ట్రంలో ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని తెలిపింది.