Manipur : భద్రతా దళాలు-సాయుధుల మధ్య తుపాకి కాల్పులు
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత;
చెదురుమదురు ఘటనలు మినహా కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో తెంగ్‌నౌపాల్ జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉదయం ఆరు గంటలకు మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించినట్టు కానీ, గాయాలైనట్టు కానీ సమాచారం లేదు. భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్‌చావో ఇఖాయ్‌లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడి, టోర్‌బంగ్‌లోని వారి వదిలిపెట్టిన తమ ఇళ్లలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆర్మీ బారికేడ్‌లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మరోమారు ఉద్రిక్తతలు చెలరేగాయి . ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), అస్సాం రైఫిల్స్,మణిపూర్ పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఐదు జిల్లాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. నిరసనకు ఒక రోజు ముందు మణిపూర్‌లోని ఐదు లోయ జిల్లాల్లో పూర్తి కర్ఫ్యూ విధించారు. మరోవైపు బిష్ణుపూర్ జిల్లాలోని ఓయినం వద్ద స్థానికులు వందలాదిగా బయటకు వచ్చి రోడ్డును దిగ్భందించారు. ఇంఫాల్ నుంచి ఫౌగగ్చావో ఇఖాయ్ వెళ్తున్న భద్రతా బలగాలను అడ్డుకొన్నారు.
మణిపూర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ప్రచురించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులపై నమోదు చేసిన రెండు కేసులపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈనెల 11 వరకు వారిని అరెస్టు చేయొద్దని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ పోలీసులను ఆదేశించింది. ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయుధ దుండగులు కొందరు పోలీసుల వేషంలో వచ్చారని, ఆటో మెటిక్ గన్‌లతో భద్రతాబలగాలపై కాల్పులు జరిపారని అనుమానాలున్నాయి. మే 3వతేదీన మణిపూర్‌లో జాతి హింస చెలరేగడంతో 160 మందికి పైగా మరణించారు మరియు అనేక వందల మంది గాయపడ్డారు.