Manipur : హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ

27 కేసులు, 53 అధికారులు…;

Update: 2023-08-31 05:45 GMT

మణిపూర్ అల్లర్ల అనంతరం నమోదైన కేసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసులు తమకు అప్పగించిన 27 కేసులపై సీబీఐ విచారిస్తోంది. ఇందులో 19 కేసులు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించినవే. మే 3న రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అయితే మణిపూర్‌లో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా వివరాలను బయటకు వెల్లడించలేదు.


ఇవే కాకుండా ఆయుధ దోపిడీ, హత్యకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పలువురు అనుమానితులను, బాధితులను విచారిస్తున్నారు. ఈ 27 కేసుల్లో 19 మహిళలపై నేరాలకు సంబంధించినవి కాగా మూడు దోపిడీ కేసులు, రెండు హత్యలు, అల్లర్లు, హత్యలు, కిడ్నాప్, సాధారణ నేరపూరిత కుట్రకు సంబంధించిన ఒక్కొక్క కేసును చేర్చారు. మణిపూర్ హింసకు సంబంధించిన కేసుల కోసం 53 మంది అధికారుల బృందాన్ని పిలిచారు. వీరిలో 29 మంది మహిళలు కూడా ఉన్నారు. వారు ఈ కేసులను దర్యాప్తు చేస్తారు. బృందం వచ్చిన తర్వాత విచారణ ఊపందుకుంది. ఇది కాకుండా, మరో 30 మంది అధికారులను విచారణ కోసం నియమించినట్లు సమాచారం.


ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న, జనాభా పరంగా మెజారిటీలుగా ఉన్న మెయితీ లకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న గిరిజన కుకీ వర్గాలు నిరసనలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులకు పాల్పడడం ప్రారంభించారు. ఈ హింసలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. రాష్ట్ర జనాభాలో మెయిటీ కమ్యూనిటీ 53 శాతం మంది ఉన్నారు. వారు ప్రధానంగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగా, కుకి వంటి గిరిజన సంఘాలు జనాభాలో 40 శాతం ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

Tags:    

Similar News