Manipur Inciden: మణిపూర్ అమానుష ఘటనలో నిందితులకు రిమాండ్
మణిపూర్ ఘటనపై చల్లారని ఆగ్రహావేశాలు... మరో నిందితుడి ఇంటికి నిప్పు.. నలుగురు నిందితులకు 11 రోజుల పోలీస్ కస్టడీ....;
మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన (Manipur Incident)పై దేశ వ్యాప్తంగా అగ్రహావేశాలు వ్యక్యమవుతూనే ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితుల( four accused )ను అరెస్టు చేయగా.. శుక్రవారం కోర్టు వీరికి 11 రోజుల పోలీసు కస్టడీ(11-day police custody) విధించింది. విచారణలో ఇందులో మరికొందరి పాత్ర గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ అమానవీయ ఘటన( Manipur viral video case)పై స్థానికుల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పుపెట్టగా తాజాగా మరొకరి ఇంటిని ధ్వంసం చేశారు. థౌబల్ జిల్లాకు చెందిన ఆ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
మణిపుర్ మహిళలను ప్రజలు తమ తల్లిలా భావిస్తారని.. కానీ, ఈ ఘటనతో నిందితులు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని సీఎం బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. మణిపుర్ అల్లర్ల క్రమంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్లు గత నెలలోనే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందిన విషయం బహిర్గతమైంది. ఫిర్యాదులు అందిన విషయాన్ని ధ్రువీకరించిన ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ.. వాటి ప్రామాణికతను తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా.. స్పందన లేకుండా పోయిందన్నారు. జాతుల మధ్య ఘర్షణల(Manipur horror)తో వణికిపోతోన్న మణిపుర్‌లో మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన (two women naked) వెలుగు చూడటం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఓ వర్గం జరిపిన పాశవిక దాడి(horrific assault)లో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా..ఆ ఇంటి ఆడబిడ్డతోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగించి సభ్య సమాజం నివ్వెరపోయేలా అక్కడి మూకలు బరితెగించాయి. మే 3న రెండు తెగల మధ్య మొదట హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఉలిక్కిపడింది.
మే 4న బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు., ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె ఉండగా మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో వారికి నాంగ్‌పోక్ సెక్‌మై వద్ద పోలీసులు కనిపించగా వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి వెయ్యి మందితో ఉన్న భారీ గుంపు బీ.ఫయనోమ్ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురిని అడ్డగించింది. అనంతరం పోలీసుల దగ్గరి ఆయుధాలు లాక్కొని దాడికి పాల్పడింది.
అందులోని యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ సాయుధ మూకల దాడిలో అతడితోపాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. ఇద్దరిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది.